జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట: జిల్లా ఆస్పత్రి ప్రహరీ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్‌తో కలిసి ఆస్పత్రి పరిసరాలను పరిశీలించా రు. ఆస్పత్రి ప్రాంగణంలో మురుగు కాల్వల నిర్మాణపనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు మరమ్మతు చేయాలని సూచించారు. వార్డులలో కిటికీలు మరమ్మతు చేయాలన్నారు. చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు విశ్రాంతి షెడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ కంటి వైద్యపరీక్షలు..
జిల్లాలో 18ఏళ్లు నిండిన వారందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారులకు సూచించారు. జిల్లా ఆస్పత్రి సందర్శన తర్వా త డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు. కంటి వెలుగు రిజిస్టర్‌ను పరిశీలించి జిల్లాకు పంపిణీ చేసిన కంటి అద్దాలు ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు. అలాగే స్క్రీనింగ్ ఎంతమంది చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ ఎంతమందికి అందజేశారని డీఎంహెచ్‌ఓ రాంమనోహర్‌రావును అడిగి తెలుసుకున్నారు.
సమయపాలన పాటించాలి..
డీఆర్‌డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది వివరాలతోపాటు, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యాలయానికి సమయానికి చేరుకోవాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.


