యువత వ్యవసాయంలో రాణించాలి
మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్‌లోని శ్రీవాణీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వ్యవసాయ పరికరాలను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాత మారకపోవడం బాధారమన్నారు. దుకాణంలో విక్రయించే వస్తువుకు ఒక ధర నిర్ణయించి అమ్ముతారు కానీ, రైతు పండించిన ధాన్యానికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు దేశంలో ఉండటంతో వ్యవసాయం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు. రైతు తాను పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే రోజులు రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు అమలుచేస్తున్నా.. వాటిని అచరణలో పెట్టడంలో విఫలమవుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంతో వ్యవసాయం అంతరించిపోయే ప్రమాదం ఉందని, కార్పొరేట్‌కు దీటుగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. లేదంటే భవిష్యత్ తరాలకు అన్నం పెట్టే నాథుడు లేకుండా పోతారన్నారు. అనంతరం ఉత్తమ రైతులను, నూతనంగా ఎన్నికై న సర్పంచులను ఆయన సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పూర్ణిమ, వెంకటేశ్వర్లుశర్మతోపాటు వినతమ్మ, నాయకులు పాల్గొన్నారు.


