రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం
నారాయణపేట ఎడ్యుకేషన్: ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆరోగ్యకర జీవనానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. జిల్లా యువజన క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక టోర్నీలు నిర్వహించామని, తాజాగా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులు 40 మంది కోచ్‌లు, మేనేజర్‌లు పాల్గొంటున్నారన్నారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సాయినాథ్ అన్నారు. కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన పోటీలు ప్రారంభవమవగా.. కార్యక్రమంలో ఉదయ భాను, యాదయ్య శెట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రాజకీయ కార్యచరణపై విస్తృత చర్చ నిర్వహించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలని, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పాత్రను బలోపేతం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఎల్లాప్పుడు ఐక్యమత్యంగా ఉండాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్‌మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శివంత్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం


