నర్వలోని నర్సరీలో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్‌లను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)
నర్వ: గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల కు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్‌నెట్‌ల పాలవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలిక షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేస్తుండడంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ పనికిరాకుండా పోతున్నాయి. దీంతో తర చూ కొత్తవి కొనుగోలు చేయడం కోసం రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 280 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయ తీల్లో నర్సరీలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 2కోట్ల 80లక్షల మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకం వేసవికాలంలో కొనసాగించాల్సి వస్తుండడంతో నీడ అవసరం పడుతోంది. ఇందుకుగాను షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గ్రామ పంచాయతీల నిధుల నుంచి ఏర్పా టు చేస్తున్నారు. లక్ష మొక్కలు పెంచుతున్న నర్సరీలకు కనీసం పది షేడ్‌నెట్‌లు అవసరం ఉంటుంది. లక్ష కన్నా ఎక్కువ మొక్కలు పెంచుతున్న నర్సరీలకు 15 నుంచి 20 వరకు షేడ్‌నెట్‌లు అవసరమవుతాయి. ఒక్కో నెట్‌కు రూ.3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన లక్ష మొక్కలు పెంచుతున్న నర్సరీలకు నీడ కోసం రూ.30వేల దాకా ఖర్చు అవుతున్నాయి. లక్ష కన్నా ఎక్కువ మొక్కలు ఉన్న చోట రూ.50వేల వరకు ఖర్చు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీలకు దాదాపు రూ.కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.
నాణ్యత లేకున్నా కొనుగోలు..
కొనుగోలు చేస్తున్న షేడ్‌నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వచ్చినా చిరిగిపోతున్నాయి. ఒక్కసారి చిరిగిపోతే పనికిరాకుండా పోతున్నాయి. మొక్కలను ఎండ నుంచి కాపాడేందుకు షేడ్ నెట్లను కొనుగోలు చేయకతప్పడం లేదు. దీనికోసం అన్నిచోట్ల నెట్లను గ్రామ పంచాయతీ నిధుల నుంచి సమకూరుస్తున్నారు. నాణ్యత లేకున్నా కొనుగోలు చేస్తున్నారు. పాతవి పనికి రాకుండా పోతుండటంతో ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను కొనుగోలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటుగా నర్సరీలు నిర్వహించే వారు నీడ కోసం ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ నర్సరీలలోనూ.. నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటా కొనుగోలు చేసే అవసరం ఉండబోదంటున్నారు. దీనివల్ల ప్రజాధనం ఆదా చేసినట్లు అవుతోందని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
గాలివానకు చిరిగిపోతున్న షేడ్‌నెట్‌లు
మొక్కల పెంపకంలో వినియోగిస్తున్న నర్సరీల నిర్వాహకులు
ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్న వైనం
సర్కారు దృష్టికి తీసుకెళ్తాం..
షేడ్‌నెట్‌ల నాణ్యతపై దృష్టి పెడతాం. ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలకులే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లలో అధికారుల ప్రమేయం లేదు. శాశ్వత ప్రాతిపదికన షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ఉన్నతాధికారుల ద్వారా సర్కారు దృష్టికి తీసుకెళ్తాం. కొన్ని పంచాయతీల్లో గతంలో కొనుగోలు చేసినవి చిరిగిపోకుండా ఉన్న వాటిని వినియోగించాలని ఆదేశాలిస్తాం. వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షేడ్‌నెట్‌లు అన్ని నర్సరీల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించాం.
– గోపాల్‌నాయక్, డీఆర్డీఓ


