చిన్నారులకు తియ్యని బాధ | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు తియ్యని బాధ

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి చిన్నపిల్లల్లో లక్షణాలు గమనించాలి

పుట్టుకతోనే వస్తున్న మహమ్మారి వంశపారంపర్యం, పలు రకాల ఇన్‌ఫెక్షన్లే కారణం

టైప్‌–1 డయాబెటీస్‌ చిన్నారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఎండోక్రైనాలజీ విభాగానికి ఓపీకి వచ్చే వారిలో ఒకప్పుడు వీరి సంఖ్య 5 శాతం ఉండగా ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. కోవిడ్‌–19 తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధికి గురైన పిల్లలకు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స, మందులు ఇస్తున్నాం. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.

–డాక్టర్‌ పి.శ్రీనివాసులు,

ఎండోక్రైనాలజీ హెచ్‌ఓడీ, జీజీహెచ్‌, కర్నూలు

తల్లిదండ్రుల్లో ఎవరికై నా షుగర్‌ ఉన్నా, గర్భస్థ సమయంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకినా అలాంటి వారికి జన్మించే పిల్లలకు షుగర్‌ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు పిల్లలను గమనిస్తూ ఉండాలి. షుగర్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి సలహా తీసుకోవాలి. వైద్య పరీక్షల్లో షుగర్‌ నిర్దారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఏమీ కాదు. ఇలాంటి పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియంత్రణ తప్పనిసరి. ఈ మేరకు పిల్లలకు వారి తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తూ ఉండాలి.

– డాక్టర్‌ కె.అమరనాథ్‌రెడ్డి,

చిన్నపిల్లల వైద్యులు, కర్నూలు

నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి కుమారునికి టైప్‌–1 డయాబెటీస్‌ ఉంది. ఆయన వైద్యుడు కాబట్టి కుమారుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి, జాగ్రత్తలు పాటించి, అవసరమైన మందులు వాడుతూ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దవాడై ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 లక్షల జనాభాలో దాదాపు 20 శాతం వరకు షుగర్‌ బాధితులు ఉన్నారు. ఇందులో పెద్దలకు వచ్చే టైప్‌–2 మధుమేహ బాధితులు 90 శాతం (9 లక్షలు) ఉంటే టైప్‌–1 బాధితులు 10 శాతం (ఒక లక్ష) వరకు ఉన్నారు. టైప్‌–2 షుగర్‌కు ప్రారంభ దశలో మందులతో నియంత్రణలో ఉంటుంది. కానీ పిల్లలకు వచ్చే టైప్‌–1 షుగర్‌ వ్యాధికి మాత్రం తప్పనిసరిగా ఇన్సులిన్‌ మందులు వాడాల్సిందే. ఈ మందును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. కానీ నెలకు ఒకటి, రెండు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. అవి వారం, పది రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. మిగతావి మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

చిన్నారులకు వచ్చే షుగర్‌ అంటే..!

శరీరంలో ఉండే క్లోమగ్రంధిలో ఇన్సులిన్‌ హార్మోన్‌ రిలీజ్‌ అవుతుంది. కొందరికి కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా సెల్స్‌) కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే నాశనం చేస్తుంది. అలాగే క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు/గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్నే టైప్‌–1 డయాబెటీస్‌ అంటారు. ఇలాంటి పిల్లలకు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాధి లక్షణాలు

విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా ఆకలి, నోరు తడి ఆరిపోవడం, కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ఆహారం తింటున్నా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గడం, శ్వాస తీసుకోవడానికి కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, నిద్రలో మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉంటాయి.

షుగర్‌ వ్యాధి పెద్దలనే కాదు పిల్లలనూ వేధిస్తోంది. కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే ఈ వ్యాధి కనిపిస్తోంది. వంశపారంపర్యంతో పాటు గర్భంలో కలిగే ఇన్‌ఫెక్షన్లు వారిని షుగర్‌ వ్యాధిగ్రస్తులుగా మారుస్తున్నాయి. ఈ వ్యాధిపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటే ఆ చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement