కర్నూలు(హాస్పిటల్): నగరంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రజలు అల్లాడిపోయారు. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. రాత్రి 12 గంటల వరకు పనులు కొనసాగుతుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించ లేకపోయారు. అర్ధరాత్రి వరకు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడారు. ఆసుపత్రుల్లో రోగులు అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు కల్లూరు మండలం పందిపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడటంతో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ దుర్మరణం చెందాడు. ఆటోలో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కర్నూలు నగరంలో కురుస్తున్న వర్షం


