పగిడ్యాల: నీటి మునక ప్రాంతమైన మూర్వకొండ సమీపంలో జరుగుతున్న పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనుల వద్ద ప్రమాదవశాత్తు ఓ వృక్తి మృతి చెందాడు. ముచ్చుమరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జౌకుపల్లె గ్రామానికి చెందిన చౌడప్ప(50) ఎల్‌ఎన్‌టీ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. తాడిపత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వరకు పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దక్కించుకున్న ఎల్‌ఎన్‌టీ కంపెనీ కొద్ది నెలల క్రితం మూర్వకొండ నీటి మునక భూముల్లో టవర్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఎలక్ట్రికల్ పనులను పర్యవేక్షించే సమయంలో స్పేస్ డాంపర్ (రింగ్) సూపర్‌వైజర్‌పై పడింది. 60 మీటర్ల ఎత్తులో నుంచి పడటంతో తల పగిలిపోయింది. తోటి వర్కర్లు గమనించి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య జీవమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె సంగీత ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జెడ్పీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన లిఫ్ట్
కర్నూలు (అర్బన్) : జిల్లాపరిషత్ కార్యాలయంలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రూ.25 లక్షలతో మరో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా జిల్లాపరిషత్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ డీఈఈ కర్రెన్న తెలిపారు.


