● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్
రాజీవ్ రంజన్ మిశ్రా
నంద్యాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టే కులగణన సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలని రిటైర్డ్ ఐఏఎస్, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన ఆధారంగానే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీలు సహా వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ అయ్యాయి, వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి, అలాగే అన్ రిజర్వడ్ కేటగిరీల్లో బీసీలు ఎంతమంది ఎన్నికయ్యారు? అనే వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. కులగణనకు సంబంధించిన డేటా మైగ్రేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు వివరించగా.. సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే వారం రోజుల్లో సూపర్ చెక్ నిర్వహించి, తనిఖీ నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బీసీ కులాల కవరేజ్ ఎలా ఉందన్న అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ కులాలకు చెందిన విద్యార్థుల నమోదు వివరాలు (ఎన్‌రోల్‌మెంట్) సేకరించాలన్నారు. పేర్లు, విద్యార్హతలు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునే అవకాశం కల్పించి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి డీసీఎస్. రాజు, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కమిషన్‌కు అందిన వినతులు...
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలో వాల్మీకులు మొదటి స్థానంలో ఉన్నారని, వారిని ఎస్టీ లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి నాయకులు కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచి రాజకీయంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కాంట్రా క్టుల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ (భక్తజన) సేవా సంఘం నాయకులు కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు.


