● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
● సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద రైతుల
ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు
నంద్యాల(అర్బన్): రాజకీయాలకు అతీతంగా జొన్నలు కొనుగోళ్లు జరగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ టీడీపీ అనుకూల రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద జొన్న కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు ఇచ్చారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గోడౌన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ వద్ద ఉన్న జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ట్రక్ షీట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్నలన్నింటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జొన్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి రాజకీయ ఒత్తిడితో కొందరు రైతులకు మాత్రమే అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రతి రైతు వద్ద ఉన్న జొన్న పంటను కొనుగోలు చేసి ట్రక్‌షీట్ ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న చంద్రబాబు ఆరుగాలం కష్టించి పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కన్నీరు పెడితే ఏ రాష్ట్రం సుఖంగా ఉండదని గుర్తు చేశారు. అనంతరం మొత్తం పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాటసాటని రాంభూపాల్‌రెడ్డి, నాయకులు కలెక్టర్ కార్యాలయ ఏఓ సుభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. వీరి వెంట వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.


