‘బ్లాక్‌ మనీ’ మోసగాడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌ మనీ’ మోసగాడు అరెస్ట్‌

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

రూ.2 లక్షలు రికవరీ,

నిందితుడి రిమాండ్‌

వెల్దుర్తి: బ్లాక్‌ మనీ పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం వెల్దుర్తి సర్కిల్‌ కార్యాలయంలో సీఐ యుగంధర్‌, కృష్ణగిరి ఎస్‌ఐ కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. ఈనెల 15వ తేదీన కృష్ణగిరి మండల పరిధిలోని ఆగవేళి గ్రామానికి చెందిన వీరేశ్‌కు సి.బెళగల్‌ మండలం బాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు రూ.లక్షకు రూ. మూడు లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. ట్యాక్స్‌ ఇతరత్రా ఎగ్గొట్టిన వాళ్లు వైట్‌ మనీగా మార్చుకునేందుకు దండిగా ఇస్తారని, బ్లాక్‌ మనీ అంటే నిజంగానే నిజమైన నోట్లను బ్లాక్‌ కలర్‌లో ఇస్తానని నమ్మించాడు. అతని ఎదురుగానే కొన్ని బ్లాక్‌ కలర్‌లో ఉన్న పేపర్లను కెమికల్‌లో ముంచి తీశాడు. బ్లాక్‌ కలర్‌ పోయి అసలైన రూ.500 నోట్లు తేలడంతో వీరేశ్‌ నమ్మి రూ.లక్ష అప్పజెప్పాడు. నిందితుడు బ్లాక్‌ కలర్‌ పేపర్ల కట్టలను ఆరింటిని (రూ.500ల నోట్లుగా తెలుపుతూ), తన వద్ద ఉన్న కెమికల్‌ను వీరేశ్‌కు అప్పజెప్పి, ఇంటికెళ్లి అన్ని కెమికల్‌లో అద్ది చూసుకో అని వెళ్లిపోయాడు. తీరా వీరేశ్‌ చూసుకోగా కేవలం పైన, కింద కొన్ని పేపర్లు నోట్లుగా మారి, మిగితావి నల్లరంగు పేపర్లు అని తెలిసి మోసపోయానని గ్రహించి కృష్ణగిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకులపాడు రస్తాలోని రైస్‌మిల్‌ గుడి వద్ద ఉన్న నిందితుడు గొల్ల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ మానేసి బ్లాక్‌ మనీతో బురిడీ కొటిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, సాధారణ నోట్లను నల్లగా మార్చిన కట్టలు, నల్లరంగు కాగితాల కట్టలను స్వాధీనం చేసుకున్నామన్నారు. డోన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన వెల్దుర్తి సీఐ యుగంధర్‌, కృష్ణగిరి ఎస్‌ఐ కృష్ణమూర్తిని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement