ఆళ్లగడ్డ: ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్ర పరిధిలో తలనీలాల సేకరణకు శుక్రవారం నిర్వహించిన వేలం పాట మరోసారి వాయిదా పడింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి తలనీలాల వేలం పాటలు ఇప్పటివరకు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. ఎలాగైనా తక్కువ ధరకు కొట్టేయాలన్న తెలుగు తమ్ముళ్ల దురాశకు దేవస్థాన నిర్వాహకులు తలొగ్గడం లేదు. ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా.. బెదిరింపులకు పాల్పడ్డా అధికారి ఏమాత్రం తలొగ్గలేదు. ఎన్నిసార్లయినా వాయిదా వేసుకుంటాం. అవసరమైతే సొంతంగా సేకరించుకుని విక్రయించుకుంటాం తప్ప రూ.1.50 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఇచ్చేది లేదని చెబుతూ వేలం పాట రద్దు చేశారు.
ఉద్రిక్తత మధ్య వేలంపాట రద్దు
అహోబిలంలో తలనీలాల వేలంపాట శుక్రవారం జరుగుతుందని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎలాగైనా దాన్ని అడ్డుకుని తాము చెప్పినట్లు రాసివ్వాలని తీవ్రస్థాయిలో అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అయినా లెక్కచెయ్యని అధికారి గుడి ఆదాయం పెంచడమే తన కర్తవ్యమని వేలం పాట నిర్వహించేందుకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ శుక్రవారం అహోబిలానికి అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతి భద్రతలు లోపిస్తాయని వేలంపాట వాయిదా వేసుకోవాలని సూచించారు. అయినా లెక్క చేయకుండా వేలం పాట నిర్వహించి తీరుతామని చెప్పడంతో ఒకానొక సమయంలో దేవస్థానం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎట్టకేలకు వేలం పాటను రద్దు చేయడంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై అహోబిలం సీఏఓ పార్థసారథి మాట్లాడుతూ.. నిర్ణయించిన కనీస ధర (రూ.1.50 కోట్లు)కు వేలం పాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగిందని, త్వరలో మరోసారి వేలం నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు.
రూ.2 కోట్లు వస్తుందని అంచనా..
గత రెండేళ్ల క్రితం వరకు (వైఎస్సార్‌సీపీ హయాంలో) అహోబిలం దేవస్థానంలో ఏటా తలనీలాల వేలం పాట ద్వారా రూ.2 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక గతేడాది అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అప్పటి అధికారులు వేలం పాట నిర్వహించకుండా నేతలు చెప్పిన ధరలకు, వారు సూచించిన వారి పేరిట హక్కులు రాసిచ్చారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా గతేడాది కంటే తక్కువకు హక్కులు రాసివ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికారి నేతల ఒత్తిడికి తలొగ్గలేదు. తలనీలాల హక్కులను నామినేషన్ పద్ధతిలో రహస్యంగా రాసిచ్చే ప్రసక్తే లేదని, వేలం పాట నిర్వహించి ఎవరు ఎక్కువ పాడితే వారికే ఇస్తామని తేల్చిచెప్పారు. కనీస ధర రూ.1.50 కోట్ల కంటే తగ్గించబోమని చెబుతూ, వేలంపాట అక్కడి నుంచే మొదలు పెట్టారు. నిర్ణయించిన ధర వచ్చే వరకు ఎన్నిసార్‌లైనా వేలం పాటను రద్దు చేస్తూనే ఉంటామని ఖరాకండిగా చెప్పారు.
అహోబిలంలో తలనీలాల
వేలం పాట మరోసారి రద్దు
నామమాత్రపు రేటుకే
కొట్టేయాలని తెలుగు తమ్ముళ్ల
విశ్వప్రయత్నం
రూ.1.50 కోట్లకు
ఒక్క రూపాయి తగ్గినా
ఇచ్చేది లేదన్న నిర్వాహకులు


