కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బందార్లపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు (53) గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడి నాపరాతి గనిలో నిల్వ ఉన్న నీటిలో బట్టలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఉతుక్కోవాలనే ఉద్దేశంతో బట్టల డ్రమ్మును తీసుకొని వెళుతుండగా కాలికి రాయి తగిలి సమీపంలో ఉన్న మోటర్‌పై పడటంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న కుమారుడు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు చాకలి వెంకట ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మామిడిని రసాయనాలతో మాగబెట్టొద్దు
కర్నూలు(హాస్పిటల్): మామిడి కాయలను రసాయన పదార్థాలతో మాగబెట్టి వాటిని విషపూరితం చేయవద్దని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపు రైతుబజార్‌లో మామిడి పండ్లను విక్రయించే రైతులు, వ్యాపారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ మేరకు 9 మామిడి పండ్లను, ఒక సాధారణ బఠానీ, ఒక గ్రీన్ బఠానీ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామిడి పండ్లను సహజ పద్ధతిలోనే మాగబెట్టాలని, త్వరగా మాగించేందుకు రసాయనాలు వాడి విషపూరితం చేయవద్దని చెప్పారు. ఇలా చేసి మాగించిన పండ్లను తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పద్ధతుల్లో పండ్లను మాగించాలన్నారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాముడు, డిస్ట్రిక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సెక్రటరీ శివమోహన్‌రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారి కళ్యాణి ఉన్నారు.
మద్యం మత్తులో కారు ఢీ..ముగ్గురికి గాయాలు
ఆదోని అర్బన్: ఫుల్‌గా మద్యం తాగి కారు నడుపుకుంటూ రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కడితోట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోసిగి గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు, భార్య షాబేరీ, షబ్బీర్, షహిత్తా అంజుమ్ ఆదోనిలో పని ముగించుకుని స్వ గ్రామానికి కారులో తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో ఆదోని వైపు వస్తున్న పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి మద్యం సేవించి రాంగ్ రూట్‌లో అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న షాబేరీ, షహిత్తా అంజుమ్, షబ్బీర్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆ రహదారిలో వెళ్తున్న వారు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం షాబేరీ, షహిత్తాఅంజుమ్‌ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఈ విషయంపై పెద్దతుంబలం ఎస్‌ఐ విద్యశ్రీ దృష్టికి తీసుకెళ్లగా... పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి షమీవుల్లా పూర్తిగా అలసిపోయి కారును ఢీకొట్టారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


