గుర్తు తెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు, లొద్దిపల్లె గ్రామాల మధ్య ప్రధాన రోడ్డు పక్కన గుర్తు తెలియని మగ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడి వయస్సు 35–40 ఏళ్ల మధ్య ఉంటుందని, శరీరంపై నలుపు, బూడిద వర్ణం గీతలు కలిగిన ఫుల్‌ టీషర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01067 సెల్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మహిళ దారుణ హత్య

ఆస్థి తగాదాలే కారణం కేసు నమోదు

హొళగుంద: ఆస్తి తగాదాల కారణంగా గురువారం అర్ధరాత్రి మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని సుళవాయి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన గాదిలింగప్పకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న హరిజన యల్లమ్మ (45) పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా నరికిన స్థితిలో దారుణహత్యకు గురైంది. ఆమెను మొదటి భార్య కుమారుడు హరిజన శేఖన్న నరికి చంపాడని మృతురాలి కుమార్తె గుండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆలూరు ఇన్‌చార్జ్‌, ఆస్పరి సీఐ శ్రీనివాసనాయక్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు హొళగుంద పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలుండగా అందరికీ వివాహాలయ్యాయని, మోదటి భార్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నట్లు వారు తెలిపారు.

గుండెపోటుతో ఉపాది కూలీ మృతి

ఆలూరు: మండలంలో అరికెర గ్రామానికి కామవరం తిమ్మప్ప (52) ఉపాధి పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. గ్రామ చెరువులో శుక్రవారం ఉపాధి కూలీలకు పని కల్పించారు. అందరితో పాటు తిమ్మప్ప పనికి వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఇంటికి చేరుకుని ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటి ఆవరణలో ముఖం కడుక్కుంటూ కుప్పకూలి మృతి చెందాడు. కళ్లెదుటే తిమ్మప్ప మృతిచెందడంతో భార్య ఉలిగమ్మ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఏపీఓ శ్రీనివాసులు తదితరులు తిమ్మప్ప భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూలీ మృతి విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లు ఏపీఓ శ్రీనివాసులు తెలిపారు.

శ్రీశైలంలో వ్యక్తి ఆత్మహత్య

శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం ఉచిత వైద్యశాల పక్కన అంబులెన్స్‌ నిలిపే స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్‌ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. దేవస్థానం వైద్యశాల పక్కన ఉన్న షెడ్‌లో వాటర్‌ పైకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి (50) శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement