ఎయిడ్స్‌ నివారణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నివారణకు కృషి చేయాలి

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

కర్నూలు(సెంట్రల్‌): ఎయిడ్స్‌ నివారణ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఏఆర్‌టీ సేవలను మరింత బలోపేతం చేసి రోగులకు అండగా నిలవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులు చికిత్సను మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టిగ్మా కారణంగా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి అవగాహన కల్పించాలన్నారు. మందుల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సస్థలు, ఏఆర్‌టీ సిబ్బంది గ్రామీణ స్థాయి ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. హెచ్‌ఐవీ నియంత్రణలో మొదటి 95 లక్ష్యాల సాధనలో జిల్లా ఇప్పటికే మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. ఇంకా పురోగతి అవసరమని సూచించారు.

బాల్య వివాహాలు, టీనేజీ ప్రగ్నెన్సీని నివారించాలి

జిల్లాలో టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇంకా బాల్య వివాహాలు, టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయని, వాటిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బందితో కౌమార దశలో ఉన్న బాలికలు, వారి తల్లిదండ్రులకు టీనేజ్‌ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వైద్య విద్యార్థులతో పాఠశాలల్లో అవగాహన సదస్సులను నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ వై.కామేశ్వర ప్రసాదు, కేఎంసీ ప్రిన్సిపాల్‌ చిట్టి నరసమ్మను ఆదేశించారు. కళాజాతా బృందాలు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహ ముక్త్‌ భారత్‌ ప్రచార రథం, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఐసీడీఎస్‌ పీడీ విజయను ఆదేశించారు. కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రుల్లా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement