కర్నూలు కల్చరల్: గోవులు సంచరించిన ప్రదేశం పవిత్రమైనదని, గోవును స్మరిస్తే మనసు ఉత్సాహంగా ఉంటుందని ప్రవచన చక్రవర్తి, వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గాయత్రీ గోశాల, గాయత్రీ గో సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారు సుంకేసుల రోడ్‌లోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘గోమాత వైభవం’ అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. గోసేవ ఎంతో గొప్పదని, గోమాత ముక్కోటి దేవతల స్వరూపమని చెప్పారు. గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేస్తే గోవు దానికి రుద్దుకున్నప్పుడు ఎన్ని కేశాలు రాలుతాయో అన్ని సంవత్సరాలు గరుకు స్తంభం ఏర్పాటు చేసిన వారి పితృ దేవతలకు పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని వివరించారు. గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి కలిపితే పంచగవ్యం అవుతుందని, దీన్ని స్వీకరించిన వారికి సమస్త పాపాలు తొలగిపోవడమే గాకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. గోవులను పోషించాలని, గోశాలలకు సహకరించి అనుగ్రహం పొందాలన్నారు.


