పంచాయతీల్లో నిలిచిన బిల్లుల చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో నిలిచిన బిల్లుల చెల్లింపు

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

త్వరలో క్లియర్‌ అవుతాయి

ఆగిన అభివృద్ధి పనులు

ఆందోళనలో ప్రత్యేక అధికారులు

జూపాడుబంగ్లా: సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఏప్రిల్‌ 3 నుంచి ప్రత్యేక అధికార పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి నెలరోజులపాటు చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయకపోవటంతో ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మంజూరు చేసే విషయమై ప్రత్యేక అధికారులకు డిజిటల్‌ కీ ఇచ్చి లాగిన్‌ ఇవ్వకపోవటంతో నిధులు మంజూరు చేసుకునే అవకాశం లేకపోవటంతో అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య కేవలం నంద్యాల జిల్లాలోని 489 పంచాయతీల్లో నెలకొనడంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్య, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీద్వారా థర్డ్‌పార్టీ వెండర్‌ డిటెయిల్స్‌ నమోదు చేసి వారి పేరున నిధులు మంజూరు చేసేవారు. ప్రస్తుతం స్వర్ణపంచాయతీ యాప్‌లో థర్డ్‌పార్టీ వెండర్స్‌ డిటెయిల్స్‌ డిస్‌ప్లే కావటం లేదు. థర్డ్‌పార్టీ వెండర్‌ డిటెయిల్స్‌ ఏవిధంగా నమోదు చేయాలనే విషయమై కంప్యూటర్‌ ఆపరేటర్లకు వివరించకపోవటంతో ఏవిధంగా బిల్లులు మంజూరు చేయాలో అర్థంకాక కంప్యూటర్‌ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామపంచాయతీలో చేసిన అభివృద్ధి పనులపై తీర్మానం, థర్డ్‌పార్టీ వెండర్‌ డిటెయిల్స్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు వాటిని అప్రూవల్‌ చేస్తే బిల్లులు మంజూరమవుతాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌ నిధుల్లోంచి కంప్యూటర్‌ ఆపరేటర్లకు, వాటర్‌మెన్‌లకు, గ్రీన్‌అంబాసిడర్లకు, థర్డ్‌పార్టీ వెండర్స్‌కు నిధులు స్పెషల్‌ అధికారుల లాగిన్‌లో మంజూరు చేయాల్సి ఉంది. సర్ణ పంచాయతీ యాప్‌లో కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్ల వివరాలు డిస్‌ప్లే అవుతుండటంతో వారికి మాత్రమే వేతనాలు మంజూరు చేసే వెసలుబాటు ఉండగా గ్రీన్‌అంబాసిడర్ల వేతనాలు, థర్డ్‌పార్టీ బిల్లులు చెల్లింపుచేసుకోలేని దుస్థితి నెలకొందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మాసాల నుంచి బిల్లులు మంజూరు కాకపోవటంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన వారికి బిల్లులు మంజూరు చేయకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

బిల్లుల చెల్లింపు నెమ్మదిగా జరుగుతుంది. త్వరలో సమస్యలు క్లియర్‌ అవుతాయి. గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు నిలిచిపోలేదు.

– గోపికృష్ణ, ఎంపీడీఓ, జూపాడుబంగ్లా

Advertisement
 
Advertisement
Advertisement