● ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: అవుకు మెట్ట సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ అర్ధరాత్రి కూల్చి వేశారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందనే సాకు చూపుతూ జేసీబీతో నేలమట్టం చేసి ఉదయానికంతా ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇది ముమ్మాటికీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కక్ష సాధింపేనంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోపించారు. రోడ్డు అభివృద్ధికి వాటర్ ప్లాంట్ ఏమాత్రం అడ్డురాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్లాంట్‌ను కూల్చివేయించారని, ఏడాది క్రితం పాత బస్టాండ్‌లోని కూలింగ్ మినరల్‌వాటర్ ప్లాంట్‌ను కూడా ఇలాగే కూల్చివేయించారన్నారు. తన హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు నీళ్లు ఇవ్వడం మంత్రి బీసీకి ఇష్టంలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాటిని తొలగించడం తగదని, ప్రజలలో పేరు రావాలంటే అభివృద్ధి పనులు చేయాలి కానీ ఇలా ఉన్నవాటిని తొలగించడం కాదని హితవు పలికారు. కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకుంటారో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతారో చూద్దామని రామిరెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటు
2020 జూన్ 28న అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజల తాగునీటి సమస్యను గుర్తించి అవుకుమెట్ట సర్కిల్ వద్ద కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్మించి ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ పక్కనే మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారి, అతి సమీపంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, హిందూ ఆలయం, రాంభూపాల్ నగర్, గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం తదితర కాలనీల ప్రజలకు ఐదేళ్లపాటు వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ పాంట్‌ను ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. చివరకు రోడ్డు అభివృద్ధి పనులకు అడ్డుగా ఉందంటూ వాటర్ ప్లాంట్‌ను కూల్చివేయడం తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే ఇంజినిరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం.


