● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: ఓటర్ల సర్వే పక్రియ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు ముస్టిం మైనారిటీ, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించేందుకు చేస్తున్న అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీఎల్‌ఏలకు సూచించారు. తన స్వగృహంలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన డోన్ మండల బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రలకు జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు సర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సర్వే సందర్భంగా అర్హులైన లక్షలాది మంది ఓటర్లను తొలగించడం చూస్తే తమ వాదనలకు మరింత బలం చేకురుతుందన్నారు. వచ్చే స్థానిక, సాధారణ ఎన్నికలకు ముందే మన రాష్ట్రంలో కూడా అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లును జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయని, అప్రమత్తంగా ఉండి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సామాస్య, మధ్యతరగతి ప్రజలతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లను తొలగించే కుట్రను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతి బీఎల్‌ఏకు పార్టీ నాయకులతో పాటు స్థానిక నాయకుల సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జరిగే ఓట్ల తొలగింపు ఎన్ని రూపాల్లో ఉంటుందనే విషాయాన్ని మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు వివరించారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, బీఎల్‌ఏ నియోజకవర్గ కమిటీ కన్వీనర్ దొరపల్లి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు తురుమాంపల్లె తిరుమల్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణంరెడ్డి, మల్యాల భాస్కర్‌రెడ్డి, బుగ్గన జయచంద్రరెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి పాల్గొన్నారు.


