బిల్లలాపురం వద్ద యథేచ్ఛగా మట్టి తవ్వుతున్న దృశ్యం
ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యం
నంద్యాల(అర్బన్): మట్టి మాఫియా చెలరేగిపోతుంది. అధికార పార్టీ అండదండలతో చెరువులు, వాగులు, వంకలను వదలడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల మండలంలో నంద్యాల చిన్న చెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో గత రెండు మూడు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్వుతున్నారు. నంద్యాల చిన్న చెరువు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ బిల్లలాపురం గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతుండగా, 856 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కానాల నాగమ్మ చెరువు చిన్న తూము వద్ద చాబోలు గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు మట్టి దందా సాగిస్తున్నారు.
టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు..
తవ్విన చెరువు మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లతో బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి 800 నుంచి రూ.1000 చొప్పున, అదే టిప్పర్ మట్టి అయితే రూ. 3వేల నుంచి 4వేల వరకు వెంచర్ల నిర్వాహకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే రైతుల పొలాలకు మట్టిని తోలుతున్నామంటూ బుకాయిస్తున్నారు. మట్టి కోసం లోతుగా తవ్వడం వల్ల చెరువు గర్భం లోతు పెరిగిపోయి పంట పొలాలకు సాగు నీటి సరఫరా జరిగే పరిస్థితి ఉండదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక మంత్రి తనయుల అండదండలతోనే మట్టి దందా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు
నంద్యాల చిన్నచెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నా అందులో ఎలాంటి వాస్తవం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. మట్టి దందాపై మూడు రోజుల క్రితం సంబంధిత రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కానాల నాగమ్మ చెరువులో మట్టి తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదని, విచారించి తగు చర్యలు తీసుకుంటామని కేసీ కెనాల్ ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు.
అధికార పార్టీ అండదండలతో
యథేచ్ఛగా తవ్వకాలు
వెంచర్లు, పొలాలకు విక్రయం
చోద్యం చూస్తున్న అధికారులు


