నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లాలోని పుట్లంపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర క్రీడాపాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎస్ రాజు తెలిపారు. 4వ తరగతిలో బాలబాలికలకు 40 సీట్లు ఉన్నాయన్నారు. అలాగే 5వ తరగతిలో ప్రవేశానికి 23 సీట్లు, 6వ తరగతిలో 8, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 8, 9 వతరగతిలో 26 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చేనెల 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం క్రీడా శాఖ వెబ్‌సైట్ https://apsportsschool.ap. gov.in/.ను సంప్రదించాలని చెప్పారు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 2567 మంది ఫీజులు చెల్లించగా 2420 మంది హాజరయ్యారు. సెకెండియర్ పరీక్షలకు 1,309 మంది ఫీజులు చెల్లించగా 1,217 మంది హాజరై పరీక్షలు రాశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని కొమ్మేమర్రి గ్రామానికి చెందిన పూసలపాటి నారాయణ (59) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. రో జూ లాగే గురువారం ఉద యం ఇంటి నుంచి ఉపాధి పనికి బయలుదేరిన నారాయణ మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని డోన్ ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేశారు.అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. మృతుడికి భార్య రమాదేవి, ఒక కుమార్తె ఉన్నారు.
మహిళా ఉద్యోగులపై వేధింపులు
● పంచాయతీ కార్యదర్శి తీరుపై
ఆరా తీసిన డీఎల్‌డీఓ శివారెడ్డి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె స్వర్ణగ్రామం (గ్రామ సచివాలయం)లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులపై పంచాయితీ కార్యదర్శి సుధాకరరెడ్డి వేధింపులు అధికమయ్యాయని ఇటీవలనే ఉన్నతాధికారులతో పాటు మంత్రి బీసీ జనార్ధనరెడ్డికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం డీఎల్‌డీఓ శివారెడ్డి గ్రామానికి చేరుకొని మహిళా సిబ్బందిని విచారించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శి తమ పట్ల అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఈయన సంజామల మండలంలో పని చేసే సమయంలో కూడా మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెండ్‌కు గురయ్యాడని డీఎల్‌డీఓ దృష్టికి తీసుకెళ్లారు. సదరు పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు.


