ఉయ్యాలవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పేదలకు సంబంధించిన ఉపాధి పనుల్లోనూ రాజకీయం చేస్తున్నారు. నచ్చిన వారికి పని కల్పించి మిగతా వారికి మొండిచేయిచూపుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మండలంలోని నర్సిపల్లె గ్రామంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఈ గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే అధికారపార్టీ నాయకులు పనులు కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది కూలీలు ఇళ్ల వద్దే ఖాళీగా ఉన్నారు. అధికారంలోకి రాగానే తమకు అనుకూలంగా ఉన్న ఉపాధి మేటి, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించుకుని, వారి ద్వారా తమను పనుల్లోకి రానివ్వడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం గ్రామానికి చెందిన కూలీలు హుసేన్‌సాహెబ్, షరీఫ్, సుభద్ర, శివమ్మ, చాంద్‌బీబీ, దస్తగిరి, జైనాబీతో పాటు మరి కొందరు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీఓ లేకపోవడంతో కార్యాలయ సీనియర్ అసిస్టెంటు శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ఉపాధి పనులు చూపడం లేదని, పాత ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి కొత్త వారిని కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కొత్తగా మేటిని నియమించి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బరితెగించిన అధికారపార్టీ
నాయకులు
నర్సిపల్లె గ్రామంలో నచ్చినవారికే
ఉపాధి పనులు
నిజమైన కూలీలకు రెండేళ్లుగా
మొండిచేయి


