తలనీలాలు చోరీకి గురైన మాట వాస్తవమే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీ వేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి, అహోబిలం దేవస్థానం
అహోబిలం క్షేత్ర ప్రతిష్టను కాపాడాలి. గతంలో ఎప్పునడూ లేని విధంగా నిర్వాహకులు టీడీపీ నేతలకు భయపడొద్దు. రెండేళ్లుగా క్షేత్రానికి రావాల్సిన రూ. కోట్ల ఆదాయాన్ని దోచు కున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి,
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. టీడీపీ నాయకుల అండ చూసుకుని కొందరు సిబ్బంది చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలతో పాటు తలనీలాలు సైతం దోచుకుంటున్నారు. అహోబిలేశునికే శఠగోపం పెడుతున్న సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కానుక.. దేవుడికే ఎరుక!
ఇలపై ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ప్రముఖమైనది. క్షేత్రంలో వెలసిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారు తమకు శక్తి మేరకు హుండీలో కానుకలు వేయడం ఆనవాయితీ. విలువైన బంగారు కానుకలతో పాటు హుండీలో వేసిన నగదును సైతం గత రెండేళ్లుగా చోరీ చేశారు. రూ.లక్షలు కొట్టేస్తూ సీసీ కెమెరాల్లో దొరికి, పోలీసులు కేసు నమోదు చేసి, సొమ్ములు తిరిగి ఇచ్చిన వారిని సైతం మళ్లీ విధుల్లోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
దొంగను వదిలి..
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు టిక్కెట్ తీసుకుంటున్న సమయంలో అసలు ధరపై అదనంగా రూ.10 నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. గత శనివారం పావన క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రూ. 3 లక్షల విలువ చేసే 10 కిలోకు పైగా తలనీలాలు దొంగలించారు. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందే దేవస్థాన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరో తెలిసి కూడా పిలిచి వివరణ కూడా తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారు. మెమో తయారు చేసినా దానిని ఇచ్చేందుకు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. దొంగతనం చేసిన వ్య క్తులు, ఇందుకు సహకరించిన వారిని వదిలిపెట్టి దొంగతనం జరిగిందని బయటపెట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తికి మోమో ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ నేతల ఒత్తిళ్లు
అహోబిల క్షేత్రంలో గత రెండేళ్లుగా భక్తులు సమర్పించే ఎంతో విలువైన కానుకలు, తలనీలాలు చోరీ అవుతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడేవారికి అక్కడే విధులు వేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే అహోబిలంలో ఏం చేసినా చెల్లుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అండ ఉన్న సిబ్బందికి ఇష్టమైన చోట (ఆదాయం వచ్చే) విధులు వేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
శనివారం వస్తే వారికి వసూళ్ల పండగే!
టిక్కెట్ ధరపై అ‘ధనం’ వసూలు
రూ. 3 లక్షల విలువైన
వెంట్రుకలు చోరీ
తస్కరులకు టీడీపీ నాయకుల అండ
చర్యలు తీసుకోవడంలో
అధికారులు విఫలం


