వడగాడ్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వడగాడ్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: రానున్న ఏడు రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. పీజీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో ఈనెల 20 నుంచి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. బహిరంగ పనుల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు.

భక్తులకు మెరుగైన

సౌకర్యాలు కల్పించాలి

ఈఓ ఎం.శ్రీనివాసరావు

శ్రీశైలంటెంపుల్‌: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సూచించారు. దేవస్థాన పరిపాలన భవనంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఉద్యోగి విధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వేసవి దృష్ట్యా ఇప్పటికే క్షేత్ర పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఆలయంలో, క్యూలైన్ల వద్ద మట్టి కుండలతో నీటిని భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద వితరణ భవనంలో శుభ్రత పాటిస్తూ భక్తులను అత్మీయంగా పలకరిస్తూ వడ్డన చేయాలని సూచించారు.

చికెన్‌ వండమంటే పచ్చడి చేశాడని హత్య

మద్యం మత్తులో దారుణం

మూడు రోజులుగా ఇంట్లోనే

మృతదేహం

ఆళ్లగడ్డ: చికెన్‌ వండమంటే పచ్చడి చేశాడనే కోపంతో స్నేహితుడిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన అహోబిలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం గ్రామానికి చెందిన శివ, బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన శంకర్‌ స్నేహితులు. అహోబిలంలో ఒకే ఇంట్లో ఉండేవారు. వారం రోజుల క్రితం ఇద్దరు మద్యం తాగారు. మత్తులో ఉన్న శివ చికెన్‌ కూర చేయాలని శంకర్‌కు సూచించాడు. అయితే శంకర్‌ చికెన్‌ కూరకు బదులు చికన్‌ పచ్చడి చేశాడు. పచ్చడి ఎందుకు చేశావని ఆగ్రహానికి గురైన శివ పక్కనున్న పచ్చడి చేసిన రోకలిబండతో శంకర్‌ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన శంకర్‌ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు రోజులు ఎవరికీ చెప్పకుండా మద్యం తాగుతూ తిరుగుతుండే వాడు. ఇరుగు పొరుగు వారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని శివను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిజం ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

దరఖాస్తు

గడువు పొడిగింపు

నంద్యాల(అర్బన్‌): నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్స్‌లో చేరేందుకు దరఖాస్తు గడువు మే 31 వరకు పొడిగించినట్లు ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ జాన్సన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www. angrau.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల కార్యాలయం పని వేళల్లో 9989625208 నంబరును సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement