● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: కొందరి నాయకులను సంతృప్తి చేయడానికి నంద్యాల మున్సిపాల్టీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి స్వగృహంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వో రామునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 42 వార్డులను పునర్ విభజన చేస్తూ 52 వార్డులు చేశామని చెబుతున్న కమిషనర్ శేషన్న వాటి వివరాలు 20 వతేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎందుకు ప్రదర్శించలేదో ప్రజలకు తెలుపాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తునట్లు అనిపిస్తోందన్నారు. వార్డుల విభజన ఇంటి నంబర్లతో కాకుండా సర్వే నంబర్ల ప్రకారం చేస్తే సామాన్యులకు ఎలా అర్ధమవుతుందన్నారు. వార్డు విభజన అభ్యంతరాల గడువు పెంచాలని, ఇంటి నంబర్ల ప్రకారం వార్డుల విభజన చేయాలని, వార్డుల ప్రకారం మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నీసా, పార్టీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి అమతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, శాదిక్ బాషా, ఆరీఫ్ నాయక్, కలాం బాషా, సుబ్బరాయుడు, మేసా చంద్రశేఖర్, జాకీర్ హుస్సేన్, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు సాయిరాం రెడ్డి, పార్ధుడు, దండే సుధాకర్, భాస్కర్ రెడ్డి, రమేష్, కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


