చిరుత దాడిలో ఆవు మృతి
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పట్టణ శివారులోని అబ్బిరాజుకుంట సమీపంలోని బొందెలకుంట ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెడ్యా నాయక్‌కు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి సమయంలో పశువుల అరుపులు వినిపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా చిరుత ఆవుపై దాడి చేసినట్లు గుర్తించారు. గ్రామస్తుల రాకను గమనించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా రేంజర్ తహేరా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత అడుగు జాడలను గుర్తించి వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో పశువులను ఒంటరిగా వదిలేయవద్దని, రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. కాగా చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో రాత్రి పహారా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


