ఉన్న బస్సులనే నడుపుతున్నాం
చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ గత ఆగస్టు 15న సీ్త్రశక్తి పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సు సర్వీసులు పెంచలేదు. దీంతో ప్రయాణికులకు నిత్యం ఇక్కట్లే ఎదురవుతున్నాయి. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 74 బస్సులు, 12 హైర్ బస్సులు ఉన్నాయి. రోజు 25 వేల మందికి పైగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సీ్త్రశక్తి పథకం ప్రారంభించాక ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. దాదాపు అన్ని బస్సులు కెపాసిటీకి మించి ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. బస్టాండులోనే బస్సు నిండటంతో తర్వాతి స్టాప్‌లలో బస్సులను నిలపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, నిత్యం శాపనార్థాలు పెడుతూ అలాగే అవస్థల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నారు.
‘ఆర్టీసీ బస్సులోప్రయాణం సురక్షితం,
సౌకర్యవంతం’ ఈ నినాదం బస్సులో రాసేందుకే పరిమితమైంది. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటేనే జనం హడలిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా మండుటెండలో గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించడం, ఎప్పుడో ఒక బస్సు వస్తే ఎక్కేందుకు గుంపులుగా తోపులాటలు, సీట్ల కోసం వాగ్వాదాలు, దూషణలు, తీరా బస్సు ఎక్కాక సీటు దొరక్క అవస్థలు, కెపాసిటీకి మించి కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ఇవన్నీ ప్రతి ప్రయాణికుడికి నిత్యం ఎదురయ్యే అనుభవాలే. – ఎమ్మిగనూరు రూరల్
సీ్త్రశక్తి పథకంతో బస్సుల్లో మహిళల ప్రయాణాలు గతం కన్నా రెట్టింపయ్యాయి. ఉన్న బస్సులను రూట్లలో తిప్పతున్నాం. వేసవి సెలవులు, పెళ్లిళ్లు, దైవ దర్శనాలకు మహిళలు వెళ్తుండటంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కర్నూలు, ఆదోని, ఇతర ప్రాంతాల రూట్లలో బస్సు సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. బస్సుల్లో నిలబడేందుకు కూడా స్థలం ఉండటం లేదు, కండక్టర్ టికెట్ కొట్టే పరిస్థితి లేకుండా తయారైంది. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలి.
– మద్దిలేటినాయుడు, డిపో మేనేజర్, ఎమ్మిగనూరు


