కౌతాళం: మండలంలో ఎరువుల దందా యథేచ్ఛగా నడుస్తోంది. గతేడాది యూరియా కోసం రైతులు పడిన పాట్లను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సరికొత్త దందాకు తెరలేపారు. యూరియా ఇవ్వాలంటే అనుబంధంగా కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిందేనని నిబంధన పెట్టి, రైతులకు అవసరం లేనివి అంటగడుతూ దోచుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునుపే స్టాక్ మొత్తం రైతులకు అంటగట్టి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది భయంకర అనుభవాలను తలచుకుంటూ మళ్లీ యూరియా దొరుకుతుందో? లేదోనని రైతులు సైతం ఎగబడి కొనడం వ్యాపారులకు వరంగా మారింది. దోపిడీని నిరోధించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తక్కువ ధరకే యూరియా అంటూ బురిడీ
యూరియా ధర బస్తా రూ.266 ఉంది. బాడుగతో కలిపి కౌతాళంకు రూ.290, హాల్వికి రూ.300 వరకు పడుతుంది. స్థానిక వ్యాపారస్తులు రూ.350 వరకు అమ్ముతారు. అయితే కొత్త దందా ప్రకారం హాల్విలో బస్తా యూరియా రూ.250, డీఏపీ రూ.1380 ప్రకారం రైతు నుంచి బయోమెట్రిక్ తీసుకొని బిల్లు ఇస్తారు. దీనికి లింక్‌గా 10–26–10 కాంప్లెక్స్ త్రిశక్తి పేరిట ఉన్న నకిలీ (ఆర్గనిక్) ఎరువు బస్తా రూ.1500కు తీసుకోవాలన్న షరతు పెట్టారు. 20 బస్తాల యూరియా ఇస్తే 10 కాంప్లెక్స్ బస్తాలు తీసుకోవాలని, 40 బస్తాల యూరియా ఇస్తే 15 నుంచి 20 బస్తాల కాంప్లెక్స్ తీసుకోవాలన్న నిబంధనలతో దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర రూ.600 వరకు ఉండగా రైతులకు మాత్రం రూ.1500కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మండల అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహరమంతా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హాల్విలో ఓ షాపు యాజమాని ఏకంగా 6 వేల బస్తాల యూరియా అమ్మినట్లు సమాచారం. సీజన్ ప్రారంభం గాక మునుపే ఇంత పెద్దస్థాయిలో యూరియా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. గతేడాది రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. యూరియా లోడ్‌లను కర్ణాటకకు అమ్ముకున్నారని, దీనికి ఏఓ శేషాద్రి కారణం అంటూ ఒక లాయర్ ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జనవరిలో అగ్రానమి ఏడీఏ రాజశేఖర్ విచారణ చేపట్టారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునేపే అధికారుల ఇండెంట్ లేకుండా వ్యాపారులకు యూరియా ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎరువుల దందాపై ఏఓ శేషాద్రిని వివరణ కోరగా.. హాల్విలో అమ్మింది 2500 బస్తాలే, గత మార్చిలో అమ్మారు, బిల్లు ఇప్పుడు వేశారు. కాంప్లెక్స్ త్రిశక్తి నకిలీ ఎరువు కాదు అర్గానిక్ అంటూ సమాధానమిచ్చారు.
ఎరువుల దందా!


