మహానంది: మండలంలోని గోపవరం గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన బిస్వజిత్‌నాథ్ (42) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అస్సాం రాష్ట్రంలోని పలాన్‌ఘాట్ గ్రామానికి చెందిన బిస్వజిత్ గత కొంత కాలం క్రితం ఇంటి నుంచి గోవా వెళుతున్నట్లు చెప్పి వచ్చాడు. గోవా వెళ్లి వచ్చిన ఆయన ఇంటికి వెళ్లకుండా నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరించేవాడని, మానసిక స్థితి సరిగా లేక గోపవరం వద్దకు వచ్చినట్లు చెప్పారు. ఈ స్థితిలో ఎండవేడికి గురవడంతో పాటు ఆహారం సరిగా లేక మృతి చెందినట్లు సమాచారం. మృతుడు బిస్వజిత్ వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా పోలీసులు ఆయన తల్లి నందరాణినాథ్, భార్య జయంతిరాయ్‌లకు సమాచారం అందించారు. బిస్వజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆదోని సెంట్రల్: ఒడిశా రాష్ట్రానికి చెందిన అర్జున్‌గండ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని రైల్వే పోలీస్‌స్టేన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మంగళవారం ట్రైన్ నంబర్ 16382 కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు ఒడిశా రాష్ట్రంలోని గంజాపర్ర, మరంగపల్లి నబరంగాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. బోర్‌వెల్ పనిచేసేవాడని, ఎక్కడా పని దొరకకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు.
బైక్‌లు ఢీ..
నలుగురికి గాయాలు
కోసిగి: మండల పరిధిలోని నేలకోసిగి గ్రామ క్రాస్ రోడ్డులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మంగళవారం కోసిగికి చెందిన గిడ్డయ్య, నాగేష్‌లు వందగల్లు గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు చేసుకుని గ్రామానికి బైక్‌పై బయలు దేరారు. అదే సమయంలో జంపాపురం గ్రామానికి చెందిన సీమోను, భీమేష్‌లు బైక్‌పై వెళ్తూ ముందు వెళ్తున్న బైక్‌ను ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నారు. రెండు బైక్‌లపై నుంచి నలుగురు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు
నంద్యాల(అర్బన్): భూగర్భ జలాల పెంపున కు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు భూగర్భ జల శాఖ డీడీహెచ్‌ఎం రఘురాం తెలిపారు. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనుల ప్రభావాన్ని శాసీ్త్రయంగా అంచనా వేస్తున్న ట్లు వెల్లడించారు.మంగళవారం కలెక్టరేట్ సమీ పంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్ద క్షేత్రస్థాయి సిబ్బందికి భూగర్భ జలమట్టాలను కొలిచే విధానంపై అవగాహన కల్పించారు.భూగర్భ జల మట్టాల్లో మార్పులను అధ్యయనం చేయడానికి పనులు జరిగిన ప్రాంతాల్లో ‘అబ్జర్వేషన్ వెల్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు, డ్వామా పీడీ సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.


