● బనవాసి కేంద్రంలో పశువులకు, ఇద్దరు కూలీలకు సంక్రమణ ● వ్యాధి సోకిన పశువులను సెమెన్ బ్యాంకుకు దూరంగా ఉంచిన డాక్టర్లు
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి సమీకృత వీర్య అబోతు కేంద్రంలోని పశువులకు ‘బ్రసెల్లోసిస్’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి పశువులతో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు కూలీలకు సంక్రమించడంతో అప్రమత్తమైన డాక్టర్లు వ్యాధి సోకిన పశువులను సెమెన్ బ్యాంక్ నుంచి దూరంగా పాతఫారం షెడ్స్‌లో ఉంచారు. ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు కలిసిపోవటం ద్వారా వ్యాప్తి చెందుతుంది. 15 రోజుల క్రితం సెమన్ బ్యాంకులో ఐదు జెర్సీ మేల్ బుల్స్, 3 ముర్రా బుల్స్ పశువులకు బ్రసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధి సోకినట్లు గుర్తించారు. అలాగే అందులో పనిచేసే బనవాసి, పరమాన్‌దొడ్డి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు శ్యాంపిల్స్‌లో పాజిటివ్ రావటంతో వారిని సెమెన్ బ్యాంక్‌లోకి రాకుండా దూరంగా ఉంచారు. సెమెన్ బ్యాంక్‌లో దాదాపు 250 నుంచి 300 వరకు పశువులు ఉంటాయి. ఒక్కో పశువు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుంది. పశువులకు ఈ వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే ప్రమాదం, పాల ఉత్పత్తి తగ్గుదల, పెయ్యదూడలు బలహీనంగా పుట్టడం, పునరుత్పత్తి సమస్యలు, వృషణాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయని, దీర్ఘకాలికంగా పశువు బలహీనపడుతుందని చెబుతున్నారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదకర వ్యాధి సంక్రమించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాధి సంక్రమణంపై సెమెన్ బ్యాంక్ ఏడీ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. వాధి సోకిన పశువులను మిగతా వాటికి దూరంగా ఉంచాం. అలాగే బాధిత కూలీలు మందులు వాడితే నెలల వ్యవధిలో తగ్గిపోతుంది. బ్యాక్టీరియా సోకిన పశువులను కేంద్రం బయటకు పంపుతాం. కూలీలకు నెగెటివ్ వచ్చే వరకు సెమెన్ బ్యాంకులోకి రావొద్దని చెప్పాం, వారి బ్లడ్ శ్యాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపాం అని చెప్పారు.


