గోనెగండ్ల: మండలంలోని చిన్నమరివీడు గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బెళగల్ గ్రామానికి చెందిన వరలక్ష్మి (56) మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. వివరాలు.. గూడూరుకు చెందిన వరలక్ష్మి భర్త చనిపోవడంతో గత కొన్ని రోజులుగా సి.బెళగల్‌లో తమ్ముడు తెలుగు శ్రీనివాసులు వద్ద ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజూమున కూరగాయలు కొనుగోలు చేసేందుకు సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన మద్దిలేటి ఆటోలో ఎమ్మిగనూరుకు బయలుదేరారు. చిన్నమరివీడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. కిందపడిన వరలక్ష్మిపై ఆటో పడటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆటో డ్రైవర్ మద్దిలేటితో పాటు మరో మహిళకు స్పల్ప గాయాలయ్యాయి. మృతురాలి తమ్ముడు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
మహిళ మృతి
పాణ్యం: మండల పరిధిలోని ఆలమూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. వివరాల మేరకు.. మంగళవారం బనగానపల్లె మండలం పసుపల గ్రామానికి చెందిన రాచర్ల సావిత్రి (50) కుమారుడు రామకృష్ణతో కలిసి ఆటోలో ఆలమూరుకు వస్తుండగా గ్రామం మలుపు వద్ద వేగంగా స్పీడ్ బ్రేకర్‌ను ఎక్కించడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కిందపడిన సావిత్రిపై ఆటో పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌కు, రామకృష్ణకు గాయాలయ్యాయి. సావిత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


