న్యాయం చేయమంటే బెదిరింపులా? | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయమంటే బెదిరింపులా?

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

కర్నూలు (టౌన్‌): ‘కర్నూలులో సతీష్‌ కుటుంబానికి న్యాయం చేయమంటే బెదిరింపులకు పాల్పడతారా?’ అని టీడీపీ నేతలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల వేధింపులు భరించలేక తమ పార్టీకి చెందిన యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై, మూడో పట్టణ సీఐ వేధింపులపై ఈనెల 14న కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశామన్నారు. మంత్రి టీజీ అనుచరులు పోలీసులతో ఒత్తిడి చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు చేశామన్నారు. దీనిపై టీడీపీ నేతలు ఎందుకంత ఆందోళన పడుతున్నారని ప్రశ్నించారు. కర్నూలు కిసాన్‌ నగర్‌లోని తన స్వగృహంలో పార్టీ నందికొట్కూర్‌ నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్‌తో కలిసి సోమవారం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాటల్లోనే..

‘మంత్రి హోదాలో టీజీ భరత్‌ కర్నూలులో అభివృద్ధి చేయకుండా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. దీన్నే మేం ప్రశ్నించాం. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, రౌడీషీటర్ల వరకు రోజూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా విమర్శిస్తే రూ.10 వేలు, గట్టిగా మాట్లాడితే స్టోర్‌ బియ్యం వంటి పనులు అప్పగిస్తున్నారేమో! ప్రజలకు సేవ చేయమని అడిగితే ‘సిద్ధార్థ రెడ్డి నీవు.. ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకో’ అని మంత్రి చెబుతున్నారు. నా కంటే ఆయనే నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. ఫార్మా కంపెనీ ముడుపుల మాట వాస్తవమే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.

తుంగభద్ర కాలుష్యంపై పోరాటం

కర్నూలులోని అల్కాలీస్‌ ఫ్యాక్టరీతో తుంగభద్ర కాలుష్యం అవుతోంది. నా దగ్గర లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు, ఆధారాలు ఉన్నాయి. కలుషితంతో పశువులు చనిపోతున్నాయి. వక్ఫ్‌, చుక్కల భూములు అన్యాక్రాంతమయ్యాయి. గోశాల ఆక్రమణలు, లీజుల వ్యవహారంపై పోరాటం చేస్తాం. పెద్దలు టీజీ వెంకటేష్‌ నాపై ఆరోపణలు చేయడం బాధాకరం.

శబరమ్మా.. వాస్తవం తెలుసుకో

అమెరికాలో ఉన్నా ఆగమేఘాల మీద నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరమ్మ కర్నూలు వచ్చి నాపై ఆరోపణలు చేశా రు. ఇదంతా మంత్రి టీజీ కార్యాలయ స్క్రిప్ట్‌ అని తెలు సు. నందికొట్కూరులో టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి.. బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని దూషించలేదా? ఎమ్మెల్యే జయసూర్య సైతం బైరెడ్డి చెబితే పనులు చేయాల్సిన అవసరం లేదని బహిరంగంగా మాట్లాడలేదా? మరి మీ నాన్నను అవమానించినప్పుడు ఎక్కడికి పోయావు శబరమ్మా! నీవు కావాలంటే ఎంబీబీఎస్‌ సీటు, పీజీ సీటు, నంద్యాల పార్లమెంట్‌ సీటు ఇప్పించారు. తండ్రిని విమర్శించినప్పుడు నోరు మెదపని మీరు.. ఇప్పుడు నాపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్‌ మీ పక్కనే ఉన్నారనే సంగతి తెలుసుకో’. అన్నారు.

అభివృద్ధిని విస్మరించి అక్రమ కేసులా?

మీ నాన్నను మాండ్ర, గౌరు దూషిస్తే

శబరమ్మా స్పందించవా?

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ

యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌

అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement