బొమ్మలసత్రం: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అలసత్వం వీడాలని జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్‌బీ, డీసీఆర్‌బీ, పాస్‌పోర్ట్, సైబర్‌క్రైమ్, ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయం కోసం ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించటమే కాకుండా త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్‌బీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీఆర్‌బీ సిబ్బంది నేరస్తుల రికార్డులను ఎప్పటికప్పుడూ కొత్త సమాచారాన్ని నమోదు చేస్తుండాలన్నారు. పాస్‌పోర్టు విభాగంలో పనిచేసే సిబ్బంది వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత సైబర్‌క్రైమ్ పోలీసులపై ఉందన్నారు. సోషల్ మీడియాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక పోస్టుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ వెంట ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు సూర్యమౌళి, మల్లికార్జునగుప్తా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 114 ఫిర్యాదులు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్‌షెరాన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 114 వినతులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి వారి సమస్యను వివరించారన్నారు. సమస్యల్లో చట్టపరమైన వాటిని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్ పరిధిలోని అధికారులకు పంపామన్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను సూచించామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని తిరిగి పీజీఆర్‌ఎస్‌కు అదే వినతులు రాకుండా చూడాలని ఆదేశించామన్నారు.


