వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. పనుల వద్ద నీడ వసతి లేకపోవడంతో మండుటెండలకు పనులు చేయాలంటే అల్లాడిపోతున్నాం. ఉదయం 9 గంటలకే ఎండలు అధికమవుతుండటంతో ఇబ్బంది పడుతున్నాం. పనుల వద్ద నీడ ఏర్పాటు చేయడంతోపాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసి కూలీల ఆరోగ్యాన్ని కాపాడాలి.
– రాములమ్మ, ఉపాధి కూలీ, కోవెలకుంట్ల
మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పేరును ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వీబీజీ రామ్‌జీగా మార్చింది. పథకం అమలులో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి కూలీలకు ప్రతి రోజు రూ. 307 సగటు వేతనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశం నీడవసతి, మజ్జిగ, ప్రథమచికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – సుధాకర్,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
కోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక కూలీలు భానుడు సెగకు విలవిలలాడుతున్నారు. నెలన్నర నుంచి రోజు రోజుకు సూర్యు డు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పొట్టకూటి కోసం ఎర్రటి ఎండలో శ్రమిస్తున్న ఉపాధి కూలీలకు వేసవి సెగ తప్పడం లేదు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.60 లక్షల జాబ్‌కార్డులుండగా ఆయా జాబ్‌కార్డుల్లో 3.72 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. ఆయా మండలాల్లో ప్రతి రోజు 79,898 మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. ఇందులో ప్యాపిలి మండలంలో అత్యధికంగా 5,577 మంది, పాములపాడు మండలంలో 5,083 మంది, గోస్పాడు మండలంలో 4,125 మంది, రుద్రవరం మండలంలో 3,719 మంది, బనగానపల్లె మండలంలో 2,785 మంది, సంజామల మండలంలో 2,638 మంది, అవుకు మండలంలో 2.,162 మంది, కోవెలకుంట్ల మండలంలో 1,951 మంది, కొలిమిగుండ్ల మండలంలో 1,936 మంది పనులకు వెళుతున్నారు. ఆయా మండలాల్లో ముళ్లపొదల తొలగింపు, కుంటలు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర పంట కాల్వల్లో పూడిక తొలగింపు, ఫీల్డ్ చానల్స్, కొండ ప్రాంతాల్లో ఫెన్స్, జలధార, జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల పెంపు, ఫీడర్‌చానల్స్, ఫారంపాండ్స్, తదితర పనులు చేపడుతున్నారు. వేసవికాలం పనుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించపోవడంతో కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. ఉపాధి కూలీలపట్ల ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పనుల వద్ద మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చేతులెత్తేశారు.
వాటర్ బెల్ వినబడదు..
ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వరు
పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఈ నెల 1వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. కాని క్షేత్రస్థాయిలో ఎక్కడా తాగునీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలు లేవు. కూలీలు ఇంటి వద్ద నుంచి బాటిళ్ల ద్వారా తాగునీటిని తీసుకెళ్లి పని ప్రదేశంలో దాహార్తి తీర్చుకుంటున్నారు. కూలీలు ఎండతీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడకుండా ప్రతి గంటకు నీరు తాగేలా వాటర్‌బెల్ పద్ధతి అమలు చేయాలి. ఇది కూడా కాగితాలకు మాత్రమే పరిమితమైంది.
● పనిచేసి అలసిసొలసిపోయిన కూలీలు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు పనిప్రదేశంలో టెంట్లు, తాటాకు, ఈతాకు పందిళ్లు వేయాలి. జిల్లా లో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించక పోవడంతో కూలీలు ఎండలో ఆపసోపాలు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా కొందరు కూలీలు పని ప్రదేశాల్లోని కంప, ఇతర చెట్ల నీడన సేద తీరుతున్నారు.
● పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతోపాటు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలి. కాని ఎక్కడా ఆ పరిస్థితులు కన్పించడం లేదు. ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని తిరిగి 11 గంటలకు ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు పనులు చేసుకునేలా వెసలుబాటు కల్పించాలి. దాదాపు రెండు నెలల నుంచి జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. అయినప్పటికి ఉపశమన చర్యలు చేపట్టడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పనుల వద్ద మౌలిక వసతులు కల్పించడంతోపాటు కూలీలకు మజ్జిగా, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించి ఉపాధి కూలీలకు అండగా నిలిచింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటికి మంగళం పాడి కూలీల జీవితాలతో చెలగాటమాడుతోంది.
ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు కరువు
45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
గూడారాలు లేక తప్పని అవస్థలు
బడ్జెట్ లేదంటున్న అధికారులు
వడదెబ్బ బారిన పడుతున్న కూలీలు


