ఊరు పొమ్మంటుందా? | - | Sakshi
Sakshi News home page

ఊరు పొమ్మంటుందా?

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

సున్నిపెంట వాసులకు నోటీసులు

ప్రజల్లో అయోమయ పరిస్థితులు

శ్రీశైలంప్రాజెక్ట్‌: సున్నిపెంట గ్రామ ప్రజలు అక్రమంగా నివాసముంటున్నారంటూ రెవెన్యూ అధికారులు ఇస్తున్న నోటీసులతో ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నివశిస్తున్నది జలవనరుల శాఖ భూములు. నోటీసులిస్తున్నది మాత్రం రెవెన్యూ శాఖ అధికారులు. ఇవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి నిమిత్తం వచ్చి 1963 సంవత్సరం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. సున్నిపెంటనే తమ స్వగ్రామంగా భావిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు ఇక్కడ లేకపోయినా శ్రీశైలం దేవస్థానంపై ఆధారపడి చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము నివశిస్తున్న ఇంటికి పట్టాలు ఇచ్చి జీవించే, నివసించే హక్కును ప్రసాదించమని ప్రజలు వేడుకుంటున్నారు.

వరం ఇచ్చిన వైఎస్సార్‌

ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించి 2008 జనవరి 01న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీఓ నం02 ఇచ్చి సున్నిపెంటను గ్రామపంచాయతీగా ప్రకటించారు. ప్రభుత్వ గృహాల్లో నివశిస్తున్న అన్నిశాఖల రిటైర్డ్‌ ఉద్యోగులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లను సొంతానికి ఇవ్వాలని నిర్ణయిస్తూ 2009 ఫిబ్రవరి 05న జీఓ నం21 విడుదల చేశారు. ఆ తర్వాత 2019 అక్టోబర్‌ 10న గ్రామపంచాయతీగా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని వసతులు

2023 మేనెల 11న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సున్నిపెంట గ్రామపంచాయతీకి 208.74 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రత్యేక చొరవ తీసు కుని సున్నిపెంటకు నాలుగు సచివాలయాలను తీసుకువచ్చి పరిపాలన ప్రారంభించారు. తాగునీటి సరఫరా కోసం రూ. కోట్లు వెచ్చించి ఆరు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మి ంచారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, వీధిలైట్లకు నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా నూతన సబ్‌ స్టేషన్‌ను నిర్మించారు. నాడు–నేడులో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనులు చేయించారు.

టీడీపీ పాలనలో..

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 2014 ఆగస్టు 14న జీఓనం 37 తీసుకువచ్చి ఇకపై గ్రామపంచాయితీ చెల్లదని, పరిపాలన జలవనరుల శాఖ వారిదేనని స్పష్టం చేసింది. సున్నిపెంటలో భూమి, గృహాల ఆక్రమణలపై జిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సమెంట్‌ 2014 నవంబర్‌ 26న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలయ్యింది. అధికారుల ఉదాశీనతతో మరి కొన్ని ఎకరాల భూమి 12 ఏళ్లలో కబ్జాకు గురయ్యింది. ఇక్కడి ప్రజలకు ఎవరి ఇళ్లు వారికి ఇవ్వాలంటే జీఓ నం21ని అమలు చేయాలి. అలాగే 2025 ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ యాక్ట్‌ కింద నివాశితులకు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఇస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి ఇంటిని వారికి రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రక్రియను చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు చెబుతున్నారు. లేదంటే ప్రతి కుటుంబానికి 2 బీహెచ్‌ కె ఇళ్లు, ఐదు ఎకరాల భూమి, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, అన్ని వసతులతో కూడిన కాలనీని నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement