అధికారులు కావలెను! | - | Sakshi
Sakshi News home page

అధికారులు కావలెను!

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

కొలిమిగుండ్ల: మండల స్థాయిలో కీలకమైన తహసీల్దార్‌ కార్యాలయంలో ముఖ్యమైన పోస్టుల్లో అధికారులు లేక సేవలు జాప్యమవుతున్నాయి. గ్రామాల నుంచి ఏదో ఒక పని మీద కార్యాలయానికి చేరుకున్నా అధికారులు లేక సకాలంలో పనులు కాక నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోంది. రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక డీటీ విశ్వతేజకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. రెండు జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూముల రీసర్వే కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడున్న ఇద్దరు అటెండర్‌లను సైతం డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఒక్కరు మాత్రమే అటెండర్‌ మిగిలారు. అధికారులకు ఫైల్స్‌ కావాలంటే వాళ్లే స్వయంగా వెతికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రైతులు పలు రకాల సమస్యల పరిష్కారం కార్యాలయానికి వస్తుంటారు. జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు ముందుగానే సర్టిఫికెట్లు సిద్ధం చేసుకునేందుకు కార్యాలయానికి వెళ్తారు. ఈ సమయంలో అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతుంది.

ఆ వీఆర్వో పోస్టు మాకొద్దు

తహసీల్దార్‌ కార్యాలయంలో పలు పోస్టులు ఖాళీ కారణంగా మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో వైపు పలు గ్రామాలకు వీఆర్వోలు లేక సకాలంలో పనులు కాక సతమతమవుతున్నారు. ప్రధానంగా మండల కేంద్రానికి పక్కనే ఉన్న ఇటిక్యాలకు వీఆర్వో పోస్టు దాదాపుగా రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంటుంది. గతంలో ఇక్కడి విధులు నిర్వహించే వీఆర్వో కొంత మంది వ్యక్తులతో చేతులు కలపడంతో వాళ్లకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాల కోసం ఎన్‌ఓసీలను ఇష్టానుసారంగా మంజూరు చేయడంతో ముఠా సభ్యులు సెంట్ల ప్రకారం లక్ష లాది రూపాయలకు విక్రయించేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టి సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తు తం ఇక్కడికి వీఆర్వోగా వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న వీఆర్వోలు సైతం ఇటిక్యాలకు ఇన్‌చార్జ్‌గా వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయ డం లేదు. ఇటిక్యాలతో పాటు మీర్జాపురం, తిమ్మనాయినపేట గ్రామాలకు ఖాళీగా ఉండటంతో ఇతరులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి సకాలంలో సేవలు అందేలా చూడాలని మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement