శిరివెళ్ల: చెరువులు, కుంటలలో భూగర్భ జలాల పెంపునకు జలధార– జలహారతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. శనివారం యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన జలఽధార– జలహారతి, స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి నిధులతో జిల్లాలో 2,216 చెరువులు, కుంటలలో జలాల పెంపునకు పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చిందన్నారు. అందులో 2001 చెరువులు, కుంటలలో పనులు మొదలయ్యాయన్నారు. అలాగే జిల్లాలో 82 వేల మంది వ్యవసాయ కూలీలు పనులకు వస్తున్నారన్నారు. రోజుకు రూ. 288 వేతనం పడుతుందన్నారు. జూన్ వరకు పాత విధానం అమలవుతుందన్నారు. జూలై నుంచి కొత్త ఉపాధి చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాడకం వలన పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఈఓఆర్డీ శ్రీనివాసశర్మ, మాజీ సర్పంచు కమతం పుల్లారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు కమతం లక్ష్మీరెడ్డి, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
బండిఆత్మకూరు: ఎరువులు, యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఆయన మండలం కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, రశీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల సాగు లేని సమయంలో డీలర్లు యూరియా, డీఏపీ విక్రయాలు చేపట్టకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియాను అధికంగా విక్రయించిన మూడు దుకాణాల లైసెన్సులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. స్థానిక ఓంకారేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో సుమారు రూ.11 లక్షల విలువైన 65 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ ఉంచాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఓ పవన్‌కుమార్, వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
ఆళ్లగడ్డ: అహోబిలంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. బండిఆత్మకూరు మండలం కడుమకాలువ గ్రామానికి చెందిన శంకర్ (54) కొంత కాలంగా అహోబిలం గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు పగలంతా ఏదో ఓ పనిచేసుకుని రాత్రికి శివ ఇంట్లోనే ఉంటూ మద్యం సేవించే వారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరు మద్యం సేవిస్తూ ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్న క్రమంలో శివ ఆవేశంతో రోకలి బండ తీసుకుని శంకర్ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా శివ మద్యం మత్తులో తిరుగుతూ ఉండేవాడు. ఇరుగుపొరుగు వారు శివ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో వెళ్లి చూసే సరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. మొదటి, రెండు విడతల్లో మెయిన్స్‌లో అర్హత పొందిన జిల్లాకు చెందిన 1,080 మంది విద్యార్థులు అడ్వాన్డ్‌న్ పరీక్షకు హాజరుకానున్నారు. కర్నూలు నగర శివారులోని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఐయాన్ డిజిటల్‌లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2, రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.


