హడలెత్తిస్తున్న బ్లాక్‌ స్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న బ్లాక్‌ స్పాట్లు

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

● ఆయా ప్రాంతాలను పరిశీలించిన జిల్లాస్థాయి భద్రత కమిటీ ● పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన కలెక్టర్‌, ఎస్పీ

● ఆయా ప్రాంతాలను పరిశీలించిన జిల్లాస్థాయి భద్రత కమిటీ ● పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన కలెక్టర్‌, ఎస్పీ

కర్నూలు : జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ ఆయా ప్రాంతాలను పరిశీలించింది. ప్రధానంగా శనివారం పంచలింగాల టోల్‌గేట్‌ వద్ద బ్లాక్‌ స్పాట్స్‌ పరిశీలన యాత్రను కలెక్టర్‌ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పాల్గొని యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు. పంచలింగాల టోల్‌గేట్‌ నుంచి వెల్దుర్తి వరకు కలెక్టర్‌, ఎస్పీ, పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవేస్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలసి బస్సులో ప్రయాణించి బ్లాక్‌ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 44వ జాతీయ రహదారిలో 9, 40వ నంబర్‌ జాతీయ రహదారిపై 2 బ్లాక్‌ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 19 బ్లాక్‌ స్పాట్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు జిల్లాస్థాయి భద్రత కమిటీ నిర్ధారించింది. ప్రమాదకర మలుపులు, సరైన సూచిక బోర్డులు, తగిన కాంతి లేకపోవడం, గుంతలు, రోడ్ల ఆకృతిలో లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ శాఖలు సమన్వయంగా వ్యవహరిస్తేనే వాహనదారులకు రక్షణ ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం...

గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద సైన్‌ బోర్డులు, సోలార్‌ బ్లింకర్స్‌, లైటింగ్‌, నో పార్కింగ్‌ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్స్‌, సర్వీస్‌ రోడ్ల వద్ద రైలింగ్‌ ఏర్పాట్లు వంటి షార్ట్‌ టర్మ్‌లో చేయదగిన పనులను నెల లోపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.

సంతోష్‌ నగర్‌ వద్ద పారిశుద్ధ్య లోపం...

సంతోష్‌ నగర్‌ వద్ద రహదారిపై పారిశుద్ధ్యం లోపించిందని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నగరపాలక కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. కృష్ణానగర్‌ హంద్రీ బ్రిడ్జి, ఐటీసీ బ్రిడ్జి ప్రాంతాల్లో సోలార్‌ వీధి లైట్లు ఏర్పాటుకు నిర్ణయించారు. బళ్లారి చౌరస్తా సమీపంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్‌ వాహనాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్‌ సూచించారు.

ఉల్లంఘనలపై తనిఖీలు విస్తృతం చేసేందుకు ప్రణాళిక

కర్నూలు నగరంలో ర్యాష్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ వంటి ఉల్లంఘనల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు రోడ్డు భద్రత కమిటీ నిర్ణయానికి వచ్చింది. దీర్గకాలం విరామం లేకుండా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. జిల్లా ప్రవేశ ప్రాంతాల్లో వాహనదారులను ఆపి ముఖాన్ని నీటితో కడిగించి టీ, నీరు తాగించే చర్యల ద్వారా ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో అవగాహన పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఇన్‌చార్జి ఆర్డీఓ అనురాధ, రవాణా శాఖ ఉప కమిషనర్‌ శాంతకుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర్‌ రెడ్డి, నేషనల్‌ హైవేస్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు, రవాణా శాఖ మోటర్‌ వాహన తనిఖీ అధికారులు పాల్గొన్నారు.

నగర పరిధిలో 8 బ్లాక్‌స్పాట్లు...

కర్నూలు నగర పరిధిలో 8 బ్లాక్‌స్పాట్లు ఉన్నాయి. షార్ట్‌ టర్మ్‌, లాంగ్‌ టర్మ్‌ ప్రణాళికతో అక్కడున్న లోపాలను సరిచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖ అధికారులతో కలసి సంయుక్తంగా పరిశీలన నిర్వహించి తక్షణ ప్రమాద నివారణ చర్యలతో పాటు వంతెనలు, ఫ్లై ఓవర్‌ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రివేళల్లోనే నగర ప్రజలను బ్లాక్‌ స్పాట్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా గుర్తించారు. ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ వినియోగించకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం, నిద్రమత్తులో డ్రైవింగ్‌ వంటి నిర్లక్ష్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అభిప్రాయపడ్డారు.

బ్లాక్‌ స్పాట్లు అంటే...

తరచూ ఒకే చోట ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తిస్తారు. వీటి సంఖ్య తగ్గించడాని కి ప్రధానంగా ఎన్‌హెచ్‌, ఆర్‌అండ్‌బీ, రవాణా, పో లీసు, ట్రాఫిక్‌, స్థానిక సంస్థలు సంయుక్తంగా పనిచేయాలని అధికారులు నిర్ధారించారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీలో వీటిపై సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకుని అమలు చేసేలా ప్రణాళిక రూ పొందించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement