● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపరేషన్‌ ● స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రేడియోథెరపీ ● కోలుకున్న ముగ్గురు చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపరేషన్‌ ● స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రేడియోథెరపీ ● కోలుకున్న ముగ్గురు చిన్నారులు

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపరేషన్‌ ● స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రేడియోథెరపీ ● కోలుకున్న ముగ్గురు చిన్నారులు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు నుంచి 9 ఏళ్ల వయస్సున్న ముగ్గురు చిన్నారులకు రేడియేషన్‌ ఆంకాలజీ విభాగం వైద్యులు సంక్లిష్టమైన, అత్యాధునిక రాపిడ్‌ ఆర్క్‌ థెరపి ద్వారా వైద్యం చేసి ప్రాణాలు పోశారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎస్‌కే ప్రకాష్‌ వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

అత్యాధునిక పరికరాల సాయంతో..

‘దేవనకొండ మండలానికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి, ఆదోనికి చెందిన మూడేళ్ల పాపకు, కర్నూలు శివారులోని ఓ గ్రామానికి చెందిన బాలికకు బ్రెయిన్‌ స్టెమ్‌, మెడుల్లా అబ్లాంగేట, సెరిబెల్లం అనే చిన్న మెదడుకు సంబంధించిన భాగాల్లో క్యాన్సర్‌ ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టే స్థోమత లేక వీరు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు వీరి పరిస్థితి దృష్ట్యా సాధ్యమైనంత వరకు తలలో ఏర్పడిన కణితులను తొలగించి, మిగిలిన కణితులను తొలగించేందుకు స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. రేడియేషన్‌ ఆంకాలజీ విభాగం వైద్యులు ప్రపంచ స్థాయి అత్యాధునిక పరికరాల సాయంతో చిన్నారులకు ప్రెసిషన్‌ రేడియోథెరపీ, రాపిడ్‌ ఆర్క్‌ థెరపీ ద్వారా చికిత్స అందించారు. వీరందరూ సాధారణంగా తమ తోటి వయస్సు పిల్లలు చేసే పనులు చేయగలుగుతున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో వ్యాధిని నియంత్రించడమే గాకుండా జీవనశైలిలో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చెయ్యడం ఇప్పుడు ఉన్న అత్యాధునిక పరికరాలతో, నిష్ణాతులైన వైద్యలు స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండటం వల్ల సాధ్యమైంది. లక్షల రూపాయల ఖర్చు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టనవసరం లేకుండా, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడే మంచి వైద్యసేవలను పొందే అవకాశం స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంది’ అని ఆయన వివరించారు. చికిత్స అందించిన వారిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూరోసర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ రాంబాలాజీ నాయక్‌, డాక్టర్‌ పుండరీకాక్షయ్య, డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ అచ్యుత్‌, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు డాక్టర్‌ జి.ఆశాలత, డాక్టర్‌ కె.సంధ్యారాణి, డాక్టర్‌ ఏంజిలీనా షైని, డాక్టర్‌ శ్వేత, డాక్టర్‌ మోహన్‌కృష్ణ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ శివశంకర్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు.

చిన్నారుల తలలో క్యాన్సర్‌

Advertisement
 
Advertisement
Advertisement