నంద్యాల: జిల్లాకు చెందిన పలువురు నేతలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామకాల ప్రకటన వెలువడింది. నంద్యాలకు చెందిన బిలావత్ శంకర్‌నాయక్‌ను రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా, పాణ్యంకు చెందిన ఎరుకల రాజును రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీగా, బనగానపల్లెకు చెందిన కాతా నిరంజన్ చంద్రమౌళీరెడ్డిని రాష్ట్ర వలంటరీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించింది.
తిరుపతి క్రైం: తిరుపతి నగరంలోని గరుడ వారధి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరకంబాడి వైపు నుంచి లీలామహల్ సర్కిల్ దిశగా వస్తున్న ఫ్లై ఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. ఆమె, తన అన్నతో కలిసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం అనూహ్యంగా గరుడ వారధిపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
జూపాడుబంగ్లా: కర్నూలు – గుంటూరు పాత రహదారి విస్తరణ సర్వే మొదలైంది. జాతీయ రహదారి 340సీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కేజీ రోడ్డును కూడా డబుల్‌రోడ్డుగా విస్తరించాలని ముందుగానే నిర్ణయించారు. ఇప్పటికే బ్రాహ్మణకొట్కూరులో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా అన్ని మిగిలిన గ్రామాల్లో వారంలోగా పనులు ప్రారంభించనున్నారు. శుక్రవారం తంగడంచ గ్రామంలో రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్‌సీ కంపెనీ ఇంజినీర్లు సర్వే చేపట్టారు. కేజీ రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి కుడి, ఎడమ వైపు 11 మీటర్ల మేర స్థలం సేకరించి రోడ్డును విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపుల రహదారి వెంబడి డ్రైనేజీ కాల్వను నిర్మించనున్నారు. హైవే రోడ్డు నిర్మాణం పూర్తయి ఇప్పటికే రెండేళ్లు కావొస్తుంది. ఇప్పటికే గ్రామాల్లోని కేజీ రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్‌సీ కంపెనీ సిబ్బంది రెండు పర్యాయాలు సర్వేచేయగా ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. మూడో సారి సర్వే చేస్తుండగా త్వరగా పనులు ప్రారంభించి రోడ్డు విస్తరిస్తారా లేదా అనే ప్రశ్న గ్రామస్తులను వేధిస్తోంది.
ఆత్మకూరులో మోస్తరు వర్షం
ఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఆత్మ కూరు పట్టణంతో పాటు నల్లమల అటవీ పరిధిలోని సమీప గ్రామాల్లో గాలులతో కూడిన వర్షం పడింది. ఎండతో అల్లాడిపోయిన ప్రజల కు ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు.


