● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో చేపట్టిన జన గణన (ఎన్యూమరేషన్) ప్రక్రియను వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జన గణన పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన జన గణన ప్రక్రియను ఈనెల 19వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా జాప్యం లేదా లోపాలు కనిపిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హెచ్‌ఎల్‌బీ (హౌస్ లిస్టింగ్ బ్లాక్) పనుల అమలులో బేతంచెర్ల, డోన్ అర్బన్, రూరల్, బనగానపల్లె మండలాలు, అలాగే బేతంచెర్ల నగర పంచాయతీ ప్రాంతాలు పనితీరులో వెనుకబడి ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
మనమిత్ర వాట్సాప్ ద్వారా పరోక్ష సేవలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో మల్లన్న స్పర్శదర్శనం, పలు ఆర్జిత సేవలతో పాటు, పరోక్షసేవలను సైతం మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్ ద్వారా భక్తులు పొందవచ్చునని శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఈఓ మాట్లాడుతూ దర్శనాలతో పాటు మొత్తం 18 ఆర్జిత సేవా టికెట్లు, విరాళాలు కూడా మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్‌పై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్త్రతంగా ఫ్లెక్సీ బోర్డులతో పాటు అవగాహన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేరం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 18 రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


