● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజాభిప్రాయ సర్వేలు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నీటి వనరులు, ఓవర్ హెడ్ ట్యాంకు లు, బోర్‌వెల్స్, పైప్‌లైన్ల పరిస్థితిని స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. నీటి వనరుల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. యాగంటి, మహానంది, ఓంకారం, శ్రీశైలం, నందవరం, అహోబిలం, ఆత్మకూరు వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీడీఎస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను స్వచ్ఛ రథాలుగా వినియోగిస్తూ గ్రామాల్లో చెత్త సేక రణ చేపడుతున్నామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద జిల్లాలో దాదాపు 36 వేల ఇళ్లు పూర్తయినా, అందులో సుమారు 4,500 ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


