గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దర్జాగా బతికిన వలంటీర్లు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు లేక కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ. 10 వేలు గౌరవ వేతనం అటుంచితే గతంలో ఇచ్చే రూ. 5 వేలు గౌ రవ వేతనం కూడా లేకపోవడంతో బతుకు భారంగా నెట్టుకొస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు వ్యవసాయ, ఉపాధి కూలీలుగా, కిరాణ దుకాణాలు, మార్ట్‌ల్లో గుమస్తాలుగా, మరి కొందరు హైదరాబాదు, బెంగళూరు, నంద్యాల, కర్నూలు వంటి పట్టణాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అరకొరగా వచ్చిన వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా వేతనాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పిల్లల చదువు, కుటుంబ ఖర్చులకు ఇబ్బందిగా మారటంతో అప్పుల ఊబిలో కూరుకపోయారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి వలంటీర్ వ్యవస్థను అమలు చేసి గౌరవవేతనాలు అందించి ఆదుకోవాలని వలంటీర్లు ముక్త కంఠంతో కోరుతున్నారు.


