ముగిసిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

నంద్యాల(న్యూటౌన్‌): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గత నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై గురువారం ముగిశాయి. చివరి రోజు జిల్లాలో మొత్తం 2,4701 మంది విద్యార్థులకు గాను 24,412 మంది పరీక్షలకు హాజరు కాగా 289 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది అంతా కష్టపడి చదివి తొలి సారి పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష ముగియగానే విద్యార్థులు సంతోషంగా వారి స్వగ్రామాలకు బయల్దేరి వెళ్లారు.

చేతి పంపునకు తాళం

పగిడ్యాల: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన చేతి పంపునకు తాళం వేసిన ఉదంతం తూర్పుప్రాతకోట గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంపు నీటిని పట్టుకోవడానికి స్థానికులు వస్తుండేవారు. అయితే బోరుకు తాళం వేయడంతో ప్రజలు నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి పడమర ప్రాతకోటలోని వాటర్‌ ప్లాంట్‌లను ఆశ్రయించి క్యాన్‌ రూ.50కు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి చేతి పంప్‌కు వేసిన తాళాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమిత్రమ్మను అడుగగా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పాలిసెట్‌ దరఖాస్తుకు 9 వరకు గడువు

నంద్యాల(న్యూటౌన్‌): పాలిసెట్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 9వ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ శైలేంద్రకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. 4వ తేదీ వరకు గడువు ఇచ్చిన అధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 9 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ సీఈఓగా జీవీ రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈఓగా విధులు నిర్వహించిన జి.నాసరరెడ్డిని అనంతపురం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమించారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని సీఈఓగా నియమిస్తూ పీఆర్‌అండ్‌ఆర్‌డీ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఈఓని డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డీపీఆర్‌సీ కోఆర్డినేటర్‌ మంజులవాణి, కర్నూలు డీఎల్‌పీఓ టి.లక్ష్మి, జెడ్పీ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రథమ స్థానం

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవా లు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాలు లక్ష్యం కాగా 7,982 ప్రసవాలను నిర్వహించారన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5,881 కాగా, సిజేరియన్‌ 2,101 కాన్పులు ఉన్నాయన్నారు. 30 శాతానికి మించి సిజేరియన్‌ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్‌ కాన్పులు చేసి, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేశారన్నారు. ఎంసీహెచ్‌ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్‌, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్‌ సీహెచ్‌సీల్లో ఈ ప్రసవాలు జరిగాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement