● ప్రభుత్వ సర్వజన వైద్యశాలను
ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గోస్పాడు: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని డాక్టర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం నంద్యాల పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తుంటారని, వారికి సరైన చికిత్సను సకాలంలో అందించాలన్నారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్‌పేషెంట్ (ఓపీ), రిజిస్ట్రేషన్ బ్లాక్, మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న చికిత్స, వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందే విధంగా చూడాలన్నారు. ఆసుపత్రులలోని వార్డులలో ఆయా విభాగాల అధిపతులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.


