శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుండంపాడుకు చెందిన గాలి ప్రవీణ్‌కుమార్ (25) మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ మధుసూదన్ తెలిపిన వివరాలు.. ప్రవీణ్‌కుమార్ నంద్యాలలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి యర్రగుంట్లకు చెందిన అనుష్కతో గతేడాది వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఈ నెల 1వ తేదీన రాత్రి ప్రవీణ్‌కుమార్ నంద్యాల నుంచి బైక్‌పై బయలుదేరాడు. నంద్యాల డిపోకు చెందిన బస్సు మరమ్మతులు చేయించుకొని సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జోజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
9న రైతు సంబరాలు
శిరివెళ్ల: కాలేషా మస్తాన్ వలి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన యర్రగుంట్లలో రాష్ట్రస్థాయి రైతు సంబరాలు (ఎద్దుల పందేలు) నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకుడు శంకర్ గురువారం తెలిపారు. ఒంగోలు జాతి సీనియర్ విభాగంలో రాతి దూళం లాగే పందెంలో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు మొదటి బహుమతి రూ.70 వేలు తరువాతి స్థానాలకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే 8వ తేదీన గాడిదల పందేలు జరుగుతాయన్నారు. గెలుపొందిన గాడిదల యజమానులకు మొదటి బహుమతి రూ.10 వేలు, తరువాతి స్థానాలకు రూ.6 వేలు, రూ.3 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.
వెల్దుర్తి: స్థానిక రాణితోటకు చెందిన ఎరుకల జయంత్ (9) కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతూ కొలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేశ్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు,కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు జయంత్ స్థానిక శర్మాస్ యూపీ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 31న జ్వరం, వాంతులతో స్థానిక సీహెచ్‌సీలో చేరాడు. ఈ నెల 1న కడుపునొప్పి, ముఖం వాపు తీవ్రం కావడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
బస్సు దిగుతూ మృత్యువాత
దొర్నిపాడు: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగుతూ దొర్నిపాడుకు చెందిన సాలయ్య (60) గురువారం మృతి చెందాడు. ఆయన ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఆళ్లగడ్డ చేరుకున్నారు.బస్టాండులో బస్సు దిగుతూ కిందపడిపోయారు. అక్కడున్న వారు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తండ్రీకుమారుడి అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని కోటేకల్ పంచాయతీ పరిధిలోని నాగలాపురంలో భారతి (29) ఆత్మహత్య కేసులో భర్త నాగరాజు, మామ చిన్నబసప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. భారతిని భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండటంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.


