● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌కు విన్నవించిన రైతులు
పగిడ్యాల: ‘పంటలు ఎండిపోతున్నాయ్.. కాపాడండి’ అంటూ సోమవారం జిల్లపాడు, శాతనకోట, సుల్తానాపురం, మల్యాల గ్రామాల రైతులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌ను ఆశ్రయించి మొరపెట్టారు. ఎత్తిపోతల నీరు తమ పొలాలకు రావాలంటే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ చేయా లని అభ్యర్థించారు. రెండు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా ఎత్తిపోసే నీరంతా దిగువకు వెళ్తున్నాయని ఎగువ తూములకు పారడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సాగునీరు రాకపోతే పంట చేతికి రాదని డీఈకి వివరించారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ.. 0 నుంచి 120 కి.మీ. వరకు కేసీ కాలువ వెంట తనిఖీ చేస్తున్నామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
ఆన్‌లైన్‌లోనే
వాహన రిజిస్ట్రేషన్
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే సాగుతుందని జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వాహన కొనుగోలు దారులు ప్రభుత్వం ఇచ్చిన రసీదును తీసుకొని, అందులో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలన్నారు. టెంపర్‌వరీ రిజిస్ట్రేషన్ ఫీజు, పర్మినెంట్ ఫీజు, పోస్టల్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు, రోడ్డు సేఫ్టీ, సర్వీస్, నంబర్ ప్లేట్ ఫీజులు వాహనాన్ని బట్టి మారుతాయన్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలని షోరూం యజమానులు చెప్పిన మాటలు నమ్మవద్దని సూచించారు.
మల్లన్న సేవలో
సినీ హీరో శ్రీకాంత్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకున్న సినీ హీరో శ్రీకాంత్ దంపతులు ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్ద సినీ హీరో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామి వారి శేషావస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. సినీ హీరో శ్రీకాంత్‌తో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు.


