● వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి రాయబారాది వసంతోత్సవ కార్య క్రమాల్లో భాగంగా సోమవారం జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన కార్యక్రమం సోమవారం ఉదయం ముగిసింది. ముందుగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భాస్కరయ్య ఆచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన తొగట వీర క్షత్రియులు, అమ్మవారి భక్తులు ముందుగానే గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నెయ్యి, గోధమ పిండి, వివిధ సుగంధ ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసుకొని వెలిగించుకొని తలపై పెట్టుకొని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గీతాలు ఆలపిస్తూ, మేళ తాళాలతో చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై మొదట సర్కార్ జ్యోతితో భక్తులు నడిచిన తరువాత మిగిలిన భక్తులు వరుసగా నిప్పులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది దాదాపు 545 జ్యోతులతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం అమ్మ వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆలయంలో కొలువైన
శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు


