కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్వరరెడ్డి, రాంబాబు సోమవారం ఉదయం నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల బందోబస్తుకు బైక్‌పై కోవెలకుంట్ల మీదుగా బయలుదేరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు ముదిరెడ్డి సుబ్బారెడ్డి కారును వేగంగా నడుపుతూ మండలంలోని పొట్టిపాడు మెట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డికి కాలు విరగగా, రాంబాబు తలకు గాయాలయ్యాయి. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


