కొలిమిగుండ్ల: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు భూ పంపిణీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని పవర్ గ్రిడ్‌కు అనుసంధానంగా నిర్మించేందుకు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల కంటే ముందుగానే తిమ్మనాయినిపేట వద్ద 415, 416 సర్వే నెంబర్లలో సుమారు 43 మందికి ఒక్కొక్కరికి ఎకరం భూమి చొప్పున భూపంపిణీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తయింది. సంబంధిత భూమిలో వేలాది రూపాయలు ఖర్చు చేసి జింగిల్ క్లియర్ పనులు చేపట్టారు. ఎన్నికల సమయంలో భూ పంపిణీ జరిగితే తమకు నష్టం చేకూరుతుందని భావించిన టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి పంపిణీని అడ్డుకున్నారు. దీంతో మండల వ్యాప్తంగా పేదలకు పంచే భూపంపిణీ ఆగిపోయింది. అయితే ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భూముల పక్కనే ప్రస్తుతం తిమ్మనాయిని పేట – నందిపాడు మధ్య పవర్ గ్రిడ్ పూర్తయింది. దీనికి అనుసంధానంగా బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు భూములు అవసరం కాగా గతంలో పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన భూములను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం కంపెనీ జీఎంతో పాటు సిబ్బంది ఆ భూమిలో సర్వే చేయడంతో పాటు యంత్రాలతో చదును చేయడంతో రైతులు చర్చించారు. తమకు కేటాయించిన భూమిలో ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. గ్రామంలో చాలా వరకు రైతులు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. ఎక్కువ భాగం పసుసు సాగు చేస్తుంటారు. ఉడికించుకోవడం, ఆరబోసుకునేందుకు వసతులు లేక పోవడంతో రైతులందరూ ఈ భూమికి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో పనులు చేసుకుంటూ ఉంటారని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్‌కు వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్న భూమిని మళ్లీ పరిశ్రమకు ఎలా ఇస్తారని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలుస్తామని రైతులు తెలిపారు.


