పొట్టు లారీలో మంటలు
● అనుమానాలకు తావిస్తున్న ఘటన
కొలిమిగుండ్ల: పొట్టును తరలిస్తున్న లారీకి మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పగా చివర్లో నాటకీయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆళ్లగడ్డ నుంచి తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తున్న పొట్టు లారీలో మంటలు చెలరేగాయి. సంజామల మండలం పేరు సోముల సమీపంలో స్థానికులు గమనించి చెప్పినా డ్రైవర్ రామేశ్వరయ్య అలాగే డ్రైవింగ్ చేస్తూ వచ్చా డు. నందిపాడు–కల్వటాల మధ్యలో లారీకి వెనుక వస్తున్న కానిస్టేబుల్ పెద్దయ్య ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని ఆపించాడు. సీఐ రమేష్‌బాబు రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఫైర్ ఇంజిన్‌ను తెప్పించి మంటలను అదుపు చేయడంతో పాటు జేసీబీల సాయంతో పొట్టును కిందకు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక పోలీసులు, రామ్‌కో సిబ్బంది సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. చీకటి పడ్డాక మళ్లీ లారీ మంటల్లో కాలిపోవడం చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టడంతో వాహనం కాలిపోయిందనే అను మానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విచారణ చేస్తామని సీఐ తెలిపారు.


